ఎరువుల డీలర్లకు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్
రైతులకు సకాలంలో నాణ్యమైన ఎరువులను, ముఖ్యంగా యూరియాను నిర్దిష్ట ధరలకు అందించటమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రైవేటు డీలర్లు కూడా నిబంధనల మేరకు పని చేస్తూ అధికార యంత్రాంగానికి సహకరించాలని ఆమె కోరారు. జిల్లాలోని ఎరువుల డీలర్లతో మంగళవారం ప్రకాశం భవనంలో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఖరీఫ్ వ్యవసాయ సీజన్ ఊపందుకోవటం, ఎరువుల అవసరము - లభ్యత, షాపుల నిర్వహణ తీరు, ఉల్లంఘిస్తే ఎఫ్.సి.ఓ.-1985 చట్టం ప్రకారం తీసుకునే చర్యలపై డీలర్లకు అవగాహన కల్పించారు.
జిల్లాలో యూరియాకు కొరత లేదని ఈ సందర్భంగా కలెక్టర్ పునరుద్ఘాటించారు. అవసరం మేరకు ప్రభుత్వం కేటాయించిందని, ఇందులో 70 శాతాన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, రైతు సేవా కేంద్రాల ద్వారా, మిగిలిన 30 శాతాన్ని ప్రైవేటు డీలర్ల ద్వారా రైతులకు అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రైవేటు డీలర్లు కూడా రైతులలో ఎలాంటి ఆందోళనకు ఆస్కారం లేకుండా ఎరువులను విక్రయించాలని ఆమె చెప్పారు. షాపులకు ఎరువులు చేరినప్పటి నుంచి వాటిని రైతులకు విక్రయించే వరకు నిబంధనల ప్రకారం వ్యవహరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎరువుల లభ్యతకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ఐ.ఎఫ్.ఎం.ఎస్. సైట్ లో నమోదు చేస్తూ ఉండాలని, ఇదే విషయాన్ని వాటి ధరలతో సహా రైతులకు తెలిసేలా షాపుల ముందు కూడా డిస్ప్లే చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎం.ఆర్.పి. కంటే అధిక ధరలకు యూరియా విక్రయిస్తే చట్టప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రికార్డులు సక్రమంగా నిర్వహించాలని, ఎరువులను కొనుగోలు చేసిన రైతులకు బిల్లులు ఇవ్వాలని పునరుద్ఘాటించారు. రైతుల ప్రయోజనాలను కాపాడేలా ఎరువుల షాపులను తనిఖీ చేసేందుకు రెవిన్యూ, పోలీసులు, ఎన్ఫోర్స్మెంట్, వ్యవసాయ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు.
జాయింట్ కలెక్టర్ శ్రీ. ఆర్. గోపాలకృష్ణ మాట్లాడుతూ రైతులకు అవసరమైన ఎరువులను కాలానుగుణంగా అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనల మేరకు ఎరువులను వినియోగించేలా రైతులకు అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తామన్నారు. ఈ క్రమంలోనే ముందుగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు ఎరువుల డీలర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశామన్నారు. యూరియా విక్రయాలతో నానో యూరియా విక్రయాలకు ముడి పెట్టవద్దని ఆయన చెప్పారు. రైతులకు ఆందోళన కలిగించే పరిణామమేదీ డీలర్ల వైపు నుంచి చోటు చేసుకోకుండా చూడాలని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు. డీలర్లకు ఏమైనా సమస్య ఉంటే ప్రభుత్వం దృష్టికి తాము తీసుకువెళ్తామన్నారు.
ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.శ్రీనివాసరావు, మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ హరికృష్ణ, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.
What's Your Reaction?






