రైతులకు రాయితీపై వ్యవసాయ పరికరాల ను పంపిణీ చేసిన ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా
సాంకేతిక పరిజ్ఞానాన్ని,యంత్ర పరికరాలను వినియోగించడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవచ్చని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆమె చెప్పారు.రైతులకు రాయితీపై వ్యవసాయ పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం ప్రకాశం భవనంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వర్ణాంధ్ర - 2047 విజన్ డాక్యుమెంట్ ప్రణాళికలో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు. వ్యవసాయ, దాని అనుబంధ రంగాలను మన జిల్లా అభివృద్ధికి ప్రధాన చోదక శక్తిగా గుర్తించినట్లు కలెక్టర్ తెలిపారు. 15 శాతం వృద్ధి రేటు లక్ష్యముగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. వ్యవసాయంలో వస్తున్న నూతన ధోరణులను రైతులు గమనిస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని, యంత్ర పరికరాలను వినియోగించడం ద్వారా మెరుగైన దిగుబడి సాధించి సాగును లాభసాటిగా మార్చుకోవచ్చని కలెక్టర్ చెప్పారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తిగతంగా రైతులకు ఉపయోగపడేలా రాయితీపై యంత్ర పరికరాలను అందిస్తున్నట్లు తెలిపారు. 2024 - 25 సంవత్సరంలో జిల్లాలో 1257 మంది రైతులకు రూ.6.05 కోట్ల విలువైన యంత్ర పరికరాలను అందించినట్లు చెప్పారు. ఇందులో రూ.2.75 కోట్లను రాయితీగా ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. రైతుల అవసరాలను తెలుసుకొని వారికి రాష్ట్ర ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. సాగుకు అవసరమైన ఎరువులు, రసాయనాల సరఫరాలో కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా అర్హులైన రైతులకు డ్రోన్లు, స్ప్రేయర్లు, సాదా మరియు ఎదగొర్రులను, కలుపుతీత పరికరాలను కలెక్టర్ పంపిణీ చేశారు. వీటిని వినియోగించడం ద్వారా తమకు కలిగే ప్రయోజనాలను రైతులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారులు, సాంకేతిక సిబ్బంది, పనిముట్ల పంపిణీ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
What's Your Reaction?






