మానవ సేవే మాధవ సేవగా గుర్తించి సహాయార్థులకు అండగా నిలవాలి .. జాయింట్ కలెక్టర్ శ్రీ.ఆర్. గోపాలకృష్ణ పిలుపునిచ్చారు..
మానవ సేవే మాధవ సేవగా గుర్తించి సహాయార్థులకు అండగా నిలిచేందుకు తమ వంతు బాధ్యతగా స్వచ్ఛందంగా ముందుకు రావాలని జాయింట్ కలెక్టర్ శ్రీ.ఆర్. గోపాలకృష్ణ పిలుపునిచ్చారు. పీ - 4 పథకంలో భాగంగా ప్రభుత్వం గుర్తించిన బంగారు కుటుంబాలకు మార్గదర్శకులుగా నిలవాలని ఆయన సూచించారు.
హోల్ సేల్ డీలర్స్ అసోసియేషన్స్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్స్, ఎల్పిజి గ్యాస్ డీలర్స్ అసోసియేషన్స్, పెట్రోల్ బంక్ ఓనర్స్ అసోసియేషన్స్, హోటల్స్ - రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్స్, సినిమా థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్స్, తూనికలు - కొలతల డీలర్స్ అసోసియేషన్స్ ప్రతినిధులతో మంగళవారం ప్రకాశం భవనములో ఆయన వేరువేరుగా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న పీ - 4 పథకం గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ ప్రతినిధులకు జాయింట్ కలెక్టర్ వివరించారు. సమాజంలో ఆర్దికంగా పైస్థాయిలో ఉన్న 10 శాతం ప్రజలు, కిందిస్థాయిలో పేదరికంతో బాధపడుతున్న 20% కుటుంబాలకు పలు రకాలుగా చేయూతనిచ్చి పేదరికాన్ని ఆయా కుటుంబాలు అధిగమించేలా చూడడమే ఈ పథకం ఉద్దేశమని తెలిపారు. ఈ దిశగా చేయూత అవసరమైన కుటుంబాలు మన జిల్లాలో 74 వేలకు పైగా ఉన్నట్లు గుర్తించామన్నారు. వీటిని ' బంగారు కుటుంబాలు'గా పేర్కొంటున్నట్లు చెప్పారు. ఆయా కుటుంబాలకు వెన్నుదన్నుగా నిలిచే వారిని ' మార్గదర్శకులు ' అని పేర్కొంటున్నట్లు తెలిపారు. మార్గదర్శకులు ఆర్థిక సహాయమే చేయా లన్నది ఈ పథకం ఉద్దేశం కాదని, బంగారు కుటుంబాలు పేదరికాన్ని అధిగమించేలా వివిధ రకాలుగా ' మార్గదర్శకం ' చేయాల్సి ఉంటుందన్నారు. ఆయా అవసరాలను, కుటుంబాలను సచివాలయ సిబ్బంది ద్వారా ఇప్పటికే గుర్తించామన్నారు. ప్రత్యేకంగా రూపొందించిన వెబ్ సైట్ లో ఈ వివరాలను
పొందుపరిచినట్లు చెప్పారు. ఈ జాబితాను అందజేస్తామని, పరిశీలించి అవసరమైన, చేయగల సహాయం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని జాయింట్ కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ జాబితాలో లేని కుటుంబాలకు కూడా అవసరం అని గుర్తించి తమకు తెలియజేస్తే వాటిని కూడా ఇందులో చేర్చుతామని తెలిపారు. స్వచ్ఛందంగా మార్గదర్శకులుగా ముందుకు రావాలని, శక్తి మేరకు ఎన్ని కుటుంబాలనైనా దత్తత తీసుకునే వెసులుబాటు ఉందని జాయింట్ కలెక్టర్ తెలిపారు. జ్ఞానాన్ని, ధనాన్ని పేదల కోసం ఖర్చు చేస్తే పుణ్యం వస్తుందని పెద్దలు చెప్తుంటారని, మానవ సేవే మాధవ సేవగా పలు మత గ్రంథాలు సైతం ప్రస్తావించాయని అన్నారు. ముఖ్యమంత్రి శ్రీ.నారా చంద్రబాబు నాయుడు సైతం ఇదే స్ఫూర్తితో పీ - 4 పథకాన్ని ప్రవేశపెట్టారని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి ఆలోచనలు, ఆశయ సాధనకు అనుగుణంగా సహాయం చేసే శక్తి ఉన్న వారందరూ తమ వంతు బాధ్యతగా, స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పేదరిక రహిత సమాజ ఆవిష్కరణలో భాగస్వాములు కావాలని జాయింట్ కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఈ సమావేశాలలో డిఎస్ఓ పద్మశ్రీ, జిల్లా పౌరసరఫరాల సంస్థ జనరల్ మేనేజర్ వరలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
What's Your Reaction?






