ప్రతి చిన్నారి బడి బాట పట్టాలి..బద్ధిపూడిలో బడి బాట కార్యక్రమం

Jun 12, 2026 - 06:37
 0  35

KVS NEWS – వార్తా కథనం ప్రతి చిన్నారి బడిబాట పట్టాలి – బాల కార్మిక వ్యవస్థకు స్వస్తి పలకాలి ఉలవపాడు, జూన్ 12: ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం బద్దిపూడి గ్రామంలోని పి.ఎం.పి మండల ప్రాథమిక పాఠశాలలో పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా "బడిబాట – బడి పిలుస్తోంది" కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయిని తాటితోటి వరలక్ష్మమ్మ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం గ్రామంలోని వీధులన్నింటిలో ఇంటింటికి తిరుగుతూ విద్యార్థులను పాఠశాలకు ఆహ్వానించింది. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజన పథకం తదితర సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరుకావడం వల్ల విద్యాభివృద్ధితో పాటు వ్యక్తిత్వ వికాసం, భవిష్యత్ అవకాశాలు మెరుగుపడతాయని ఉపాధ్యాయులు వివరించారు. గ్రామంలోని ప్రతి బాలబాలిక విద్యకు దూరం కాకుండా చూడటం సమాజం మొత్తం బాధ్యత అని పేర్కొన్నారు. అదేవిధంగా అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు గ్రామస్తులకు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై అవగాహన కల్పించారు. 14 సంవత్సరాల లోపు పిల్లలను ఏ విధమైన పనిలోనూ నియమించడం చట్టరీత్యా నేరమని, 14 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలను ప్రమాదకర పరిశ్రమల్లో పనిచేయించడం కూడా చట్టవిరుద్ధమని తెలిపారు. ప్రతి చిన్నారికి విద్య, ఆరోగ్యం, భద్రత, గౌరవప్రదమైన బాల్యం హక్కులుగా రాజ్యాంగం కల్పించిందని ఆయన పేర్కొన్నారు. బాల కార్మిక వ్యవస్థ పిల్లల భవిష్యత్తును దెబ్బతీస్తుందని, వారి శారీరక, మానసిక ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తుందని వివరించారు. గ్రామంలో ఏ చిన్నారి పనిలో నిమగ్నమై కనిపించినా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని గ్రామస్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బెల్లంకొండ శ్రీకాంత్, అంగన్వాడీ సిబ్బంది ఎం. పార్వతి, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు మరియు గ్రామస్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0