బీసీ అభ్యర్థులకు సంపూర్ణ న్యాయం చేయాలి – ఏపీపీఎస్సీకి వినతి

Jun 17, 2026 - 12:57
 0  49
BC అభ్యర్థుల తరఫున ఏపీపీఎస్సీకి వినతి
1 / 1

BC అభ్యర్థుల తరఫున ఏపీపీఎస్సీకి వినతి

బీసీ అభ్యర్థులకు సంపూర్ణ న్యాయం చేయాలి – ఏపీపీఎస్సీకి వినతి సింగరాయకొండ, జూన్ 17: ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో సమావేశమైన వెనుకబడిన వర్గాల ప్రత్యేక కమిషన్‌కు, ఉద్యోగ నియామకాలలో బీసీ అభ్యర్థులకు పూర్తి న్యాయం చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ బీసీ ఉద్యోగుల సంఘం ప్రకాశం జిల్లా కార్యదర్శి అర్రిబోయిన రాంబాబు, అంబటి బ్రహ్మయ్య, మసూద్ అలీ, నూకసాని వెంకటేశ్వర్లు వినతిపత్రం సమర్పించారు. ఉద్యోగ నియామకాలలో ఓపెన్ కేటగిరీ మెరిట్‌లో ఎంపికైన బీసీ అభ్యర్థులను ఓపెన్ కేటగిరీలోనే పరిగణించి, వారి వల్ల ఖాళీ అయ్యే బీసీ రిజర్వేషన్ స్థానాలను ఇతర అర్హులైన బీసీ అభ్యర్థులతో భర్తీ చేయాలని వారు కోరారు. రిజర్వేషన్ విధానం వెనుకబడిన వర్గాలకు గరిష్ట అవకాశాలు కల్పించడమే అసలు ఉద్దేశమని, మెరిట్‌తో ఎంపికైన బీసీ అభ్యర్థులను రిజర్వేషన్ కోటాలో లెక్కించడం వల్ల ఇతర బీసీ అభ్యర్థులు అవకాశాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఓపెన్ కేటగిరీలో ఎంపికైన బీసీ అభ్యర్థులను అదే కేటగిరీలో కొనసాగించి, బీసీ రిజర్వేషన్ స్థానాలను పూర్తిస్థాయిలో బీసీలతోనే భర్తీ చేసేలా తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని ఏపీపీఎస్సీని కోరారు. ఈ చర్యతో సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, రిజర్వేషన్ విధానం లక్ష్యం మరింత సమర్థవంతంగా అమలవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యోగుల సంఘం సభ్యులు, బీసీ నిరుద్యోగులు పాల్గొన్నారు

What's Your Reaction?

Like Like 2
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0