పాత సింగరాయకొండలో రూ.68 లక్షల సిమెంట్ రోడ్డుకు ప్రారంభోత్సవం రూ.12 లక్షల మంచినీటి పైపులైన్‌కు శంకుస్థాపన – రూ.45 కోట్ల బీసీ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు: మంత్రి సవిత
సింగరాయకొండ: కొండేపి నియోజకవర్గంలోని పాత సింగరాయకొండ గ్రామంలో రూ.68 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన సిమెంట్ రోడ్డును రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ నూకసాని బాలాజీ, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహా రెడ్డి సంయుక్తంగా ప్రారంభించారు.
అనంతరం రూ.12 లక్షల అంచనా వ్యయంతో ఎస్టీ కాలనీలో చేపట్టనున్న మంచినీటి పైపులైన్ నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ, రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావించి కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. కొండేపి నియోజకవర్గంలో ఇప్పటికే రూ.500 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు.
2018లో సింగరాయకొండకు ప్రతిపాదించిన బీసీ రెసిడెన్షియల్ పాఠశాలను గత ప్రభుత్వం నిలిపివేసిందని విమర్శించిన ఆయన, ప్రస్తుతం తమ విజ్ఞప్తి మేరకు మంత్రి సవిత ఆధ్వర్యంలో రూ.45 కోట్లతో పాఠశాలకు మంజూరు లభించిందని వెల్లడించారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలను ప్రస్తావిస్తూ, దేశంలోనే అత్యధిక పెన్షన్లు అందిస్తున్న ప్రభుత్వం తమదేనని, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, "అన్నదాత సుఖీభవ" కింద రైతులకు ఏటా రూ.20 వేల పెట్టుబడి సాయం, "తల్లికి వందనం" ద్వారా ప్రతి విద్యార్థికి రూ.13 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. అలాగే "స్త్రీ శక్తి", "దివ్యాంగ శక్తి" పథకాల ద్వారా ఉచిత బస్సు ప్రయాణం, ఎస్సీ–ఎస్టీ కుటుంబాలకు సోలార్ వ్యవస్థల ఏర్పాటు వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు.
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం ప్రజల మధ్యే ఉండి సమస్యలకు తక్షణ పరిష్కారం చూపుతోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.
సింగరాయకొండ బీసీ రెసిడెన్షియల్ స్కూల్‌కు రూ.45 కోట్లు మంజూరు చేసి, తొలి దశలో రూ.20 కోట్లు విడుదల చేసినట్లు ప్రకటించారు. ఇదే విధంగా కనిగిరిలో కూడా రూ.45 కోట్లతో బీసీ రెసిడెన్షియల్ స్కూల్‌కు మంజూరు చేసి, తొలి విడతగా రూ.20 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహా రెడ్డి మాట్లాడుతూ, విద్య ద్వారానే పేదరికాన్ని నిర్మూలించవచ్చనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో బీసీ రెసిడెన్షియల్ పాఠశాల లేదా కళాశాల ఏర్పాటు చేయాలని మంత్రి సవితను కోరారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0