ఎఫ్ ఎల్ ఎన్ శిక్షణా కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర సమగ్ర శిక్ష అకాడమిక్ మానిటరింగ్ కోఆర్డినేటర్ కల్పన శైల

Jun 9, 2026 - 12:44
 0  147

కందుకూరులో ఎఫ్‌ఎల్‌ఎన్ శిక్షణకు ప్రశంసలు.. ఉపాధ్యాయులు పునాది స్థాయిలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి: కల్పనా శైల ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గ స్థాయి ఎఫ్‌ఎల్‌ఎన్ (ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ) శిక్షణా కేంద్రాన్ని రాష్ట్ర సమగ్ర శిక్ష అకాడమిక్ మోనిటరింగ్ కోఆర్డినేటర్ శ్రీమతి కల్పనా శైల పరిశీలించారు. ఈ సందర్భంగా శిక్షణలో పాల్గొన్న ఉపాధ్యాయులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, విద్యార్థుల మెదడు అభివృద్ధిలో అత్యంత కీలకమైన దశ ఒకటి, రెండు తరగతులేనని, ఈ స్థాయిలోనే భాషా, గణిత నైపుణ్యాలకు బలమైన పునాది ఏర్పడుతుందని పేర్కొన్నారు. పాఠశాలల్లో ఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి విద్యార్థుల్లో చదవడం, రాయడం, లెక్కించడం వంటి ప్రాథమిక నైపుణ్యాలను పెంపొందించాలని సూచించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాలల పట్ల బాధ్యతాయుత దృక్పథంతో వ్యవహరిస్తూ పాఠశాలలను ఆకర్షణీయమైన అభ్యాస కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న 36 రోజుల స్కూల్ రెడినెస్ కార్యక్రమానికి సంబంధించిన పాఠ్యపుస్తకాలు, మాడ్యూల్స్ ఇప్పటికే పాఠశాలలకు చేరాయని తెలిపారు. బాల కిట్స్, సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్, జాదూ పిటారా కిట్స్, ఎఫ్‌ఎల్‌ఎన్ కిట్స్, టార్ల్ కిట్స్ వంటి బోధన-అభ్యసన సామగ్రిని కూడా అందించామని చెప్పారు. డిజిటల్ కంటెంట్‌తో కూడిన 256 జీబీ పెన్‌డ్రైవ్‌లను సమర్థవంతంగా వినియోగించి విద్యార్థులు కరికులం లక్ష్యాలను సాధించేలా కృషి చేయాలని సూచించారు. జాయ్‌ఫుల్ లెర్నింగ్ ద్వారా నైపుణ్య ఆధారిత విద్యను అందించడంతో పాటు పాఠశాలల మౌలిక వసతులను మెరుగుపరచి ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దాలని ఆమె అన్నారు. సమాజంలో ఉపాధ్యాయులు ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు. మార్కాపురం ఉన్నత పాఠశాలను అక్కడి ప్రధానోపాధ్యాయుడు అభివృద్ధి చేసిన తీరును ప్రశంసిస్తూ, జిల్లాలోని అన్ని పాఠశాలలు అదే తరహాలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. శిక్షణా కార్యక్రమంలో అన్ని వసతులు సమృద్ధిగా ఉండటంతో పాటు ఉపాధ్యాయులకు అందించిన భోజనం కూడా నాణ్యంగా, రుచికరంగా ఉందని కల్పనా శైల అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అకాడమిక్ మోనిటరింగ్ ఆఫీసర్ నాగేంద్ర నాయక్, ఎంఈఓలు సుబ్బారెడ్డి, శర్మ, కేఆర్పీలు అర్రిబోయిన రాంబాబు, అంబటి బ్రహ్మయ్య, డీఆర్పీలు పాల్గొన్నారు. సుమారు 280 మంది ఉపాధ్యాయులు శిక్షణలో పాల్గొని, ఇందులో పొందిన అవగాహన తమ బోధనలో ఎంతో ఉపయోగపడుతుందని, ఈ కార్యక్రమం తమకు విశేషమైన సంతృప్తిని కలిగించిందని తెలిపారు. 

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0