ఆర్యవైశ్య సంఘాల సేవలకు రైల్వే శాఖ అభినందనలు

Nov 9, 2026 - 12:31
 0  36

తుఫాన్ వేళ ఆపన్నహస్తం.. ఆర్యవైశ్య సంఘాల సేవలకు రైల్వే శాఖ ప్రశంసలు!

సింగరాయకొండ: మురసు తుఫాన్ ప్రభావంతో సింగరాయకొండ రైల్వే స్టేషన్‌లో నిలిచిపోయిన రైళ్లలోని వేలాది మంది ప్రయాణికులకు ఆపన్నహస్తం అందించిన ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్స్ సభ్యుల సేవలను రైల్వే శాఖ అభినందించింది. ప్రయాణికులకు అందించిన సేవలకు గుర్తింపుగా విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్ (DRM) మోహిత్ సోనాకియా ప్రశంసా పత్రాన్ని అందజేశారు. మురసు తుఫాన్ కారణంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో తిరుపతి–విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, తిరుపతి–కాకినాడ టౌన్ ఎక్స్‌ప్రెస్, తిరునెల్వేలి–నరసాపురం ఎక్స్‌ప్రెస్ రైళ్లు సింగరాయకొండ రైల్వే స్టేషన్‌లో నిలిచిపోయాయి. దీంతో ఆయా రైళ్లలో ప్రయాణిస్తున్న సుమారు 2,000 నుంచి 3,000 మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రయాణికుల ఇబ్బందులను గుర్తించిన సింగరాయకొండ ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్స్ సభ్యులు మానవతా దృక్పథంతో ముందుకొచ్చారు. సుమారు రూ.80 వేల విలువైన పాలు, బిస్కెట్లు, సాంబార్ రైస్, ఉప్మా, పెరుగన్నం, టీ, పులిహోర తదితర ఆహార పదార్థాలను ప్రయాణికులకు అందజేశారు. రైళ్లలోని ప్రయాణికుల వద్దకే వెళ్లి ఆహార పదార్థాలను అందిస్తూ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమాన్ని గుర్తించిన విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్ మోహిత్ సోనాకియా, ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర కార్యదర్శి కె. శ్రీరంగనాయకులు పేరుతో పాటు సంఘం సభ్యుల సేవలను ప్రత్యేకంగా ప్రశంసిస్తూ నవంబర్ 5వ తేదీన ప్రశంసా లేఖ జారీ చేశారు. ఈ ప్రశంసా పత్రాన్ని నవంబర్ 9న సింగరాయకొండలో అందజేశారు. ఆపద సమయంలో ప్రయాణికులకు ఆహారం, అవసరమైన సదుపాయాలు కల్పించి మానవత్వాన్ని చాటుకున్న ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్స్ సభ్యుల సేవలు అభినందనీయమని పలువురు ప్రశంసించారు. ఆపదలో ఉన్నవారికి అందించే సాయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది.. సేవకు లభించిన ఈ రైల్వే శాఖ ప్రశంస సింగరాయకొండకు గర్వకారణంగా నిలిచింది.

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0