పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా పగడ్బందీగా ..

Mar 7, 2026 - 11:15
 0  16
1 / 1

 పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా పగడ్బందీగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్రీ.పి.రాజాబాబు స్పష్టం చేశారు. ఈ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో శనివారం ప్రకాశం భవనంలో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎస్పీ శ్రీ.వి.హర్షవర్ధన్ రాజుతో కలిసి జిల్లాలోని పరిస్థితిపై సమీక్షించారు. ఈనెల 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు రెగ్యులర్ విభాగ పరీక్షలు, 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షలు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించినట్లు డిఇఓ శ్రీమతి సి.వి. రేణుక ఈ సందర్భంగా వివరించారు.  రెగ్యులర్ పబ్లిక్ పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు, ఓపెన్ స్కూల్ పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఉంటాయని తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, కేటాయించిన కేంద్రాలు, తదితర వివరాలను కూడా డీఈవో వివరించారు. 
            దీనిపై కలెక్టర్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో పరీక్ష కేంద్రాల్లో విద్యుత్, త్రాగునీరు, వైద్య శిబిరాలు, పారిశుద్ధ్య నిర్వహణ వంటి మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. సంబంధిత అధికారులు ఒక వారం ముందుగానే ఆయా కేంద్రాలను సందర్శించి వీటిపై దృష్టి సారించాలని ఆయన దిశా నిర్దేశం చేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం తగిన రవాణా సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ అధికారులకు చెప్పారు. ఎస్పీ మాట్లాడుతూ పరీక్ష కేంద్రాలకు సమీపంలో జిరాక్స్ సెంటర్ లను మూసివేయిస్తామని, అవసరమైన బందోబస్తు కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. 
                 ఈ సమావేశంలో డిఆర్ఓ బి.చిన ఓబులేసు, ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్ జగన్నాధరావు, ఏపీ సీపీడీసీఎల్ ఎస్.ఈ. వెంకటేశ్వర్లు, డిటిసి సుశీల, డిఎంహెచ్వో వెంకటేశ్వర్లు, ఏపీఎస్ఆర్టీసీ ట్రాఫిక్ సూపర్వైజర్ ఫణి కుమార్, పంచాయతీ, మున్సిపల్, పోస్టల్ శాఖ అధికారులు పాల్గొన్నారు. 


పరీక్షల నిర్వహణ ఇలా...

*. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రెగ్యులర్ పబ్లిక్ పరీక్షలకు మొత్తం 28,632 మంది విద్యార్థులు హాజరవుతారు. వీరిలో రెగ్యులర్ విభాగంలో 14,289 మంది బాలురు, 14,312 మంది బాలికలు ఉన్నారు. ప్రైవేట్ విభాగంలో 21 మంది బాలురు, పదిమంది బాలికలు ఉన్నారు. 

*. ఓపెన్ స్కూల్ సొసైటీ నుంచి రెగ్యులర్ మరియు ఒకసారి ఫెయిల్ అయిన వారు 1144 మంది ఉన్నారు. వీరిలో 823 మంది బాలురు, 321 మంది బాలికలు పరీక్షలు రాస్తారు. 

*. ఎస్.ఎస్.సి. పబ్లిక్ పరీక్షల కోసం 165 సెంటర్లను, ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షల కోసం 14 సెంటర్లను ప్రభుత్వం కేటాయించింది. 

*. పబ్లిక్ పరీక్షలు ముగిశాక ఒంగోలులోని డిఆర్ఆర్ఎం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఏప్రిల్ నాలుగవ తేదీ నుంచి 13వ తేదీ వరకు స్పాట్ వాల్యుయేషన్ ఉంటుంది. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0