టంగుటూరు గురుకుల పాఠశాలలో మంత్రుల ఆకస్మిక తనిఖీ – విద్యార్థుల తల్లిదండ్రులతో స్వయంగా మాట్లాడిన మంత్రులు
ప్రకాశం జిల్లా టంగుటూరులోని మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రులు పాఠశాలలోని వంటగది, తరగతి గదులు, విద్యార్థినులకు కల్పిస్తున్న వసతులను పరిశీలించారు. విద్యార్థినులతో ముచ్చటించి విద్యా బోధన, భోజన నాణ్యతపై వివరాలు తెలుసుకున్నారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్డ్ టెలిఫోన్ ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడి, పిల్లల చదువు, సంక్షేమంపై ఆరా తీశారు.
గత ఏడాది విద్యార్థులు సాధించిన ఉత్తమ ఫలితాలు పాఠశాల విద్యా ప్రమాణాలకు నిదర్శనమని మంత్రి సవిత ప్రశంసించారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, ఉపాధ్యాయులను సన్మానించి బహుమతులు అందజేశారు.
మంత్రి ఎస్. సవిత మాట్లాడుతూ, పాఠశాలలో తక్షణ అవసరాల కోసం రూ.4 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పిస్తున్నామని తెలిపారు.
ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన రూ.500 కోట్ల SASKI నిధుల్లో భాగంగా సింగరాయకొండ బీసీ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణానికి రూ.45 కోట్లు కేటాయించామని, ఇప్పటికే తొలి విడతగా రూ.20 కోట్లు విడుదలయ్యాయని, త్వరలోనే భూమిపూజ నిర్వహిస్తామని వెల్లడించారు.
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కొండేపి నియోజకవర్గానికి రెండు కొత్త బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేశారని తెలిపారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం సాంఘిక సంక్షేమ శాఖలో 3, బీసీ సంక్షేమ శాఖలో 2, గిరిజన సంక్షేమ శాఖలో 1, మైనారిటీ సంక్షేమ శాఖలో 1 విద్యాసంస్థలను అటాచ్ చేస్తున్నట్లు వివరించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను 'రతన్ టాటా ఇన్నోవేటివ్ హబ్' ద్వారా ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలల్లో ట్రాక్ చేసి విద్యా సాధికారత కల్పిస్తామని చెప్పారు.
పి-4 వర్గానికి చెందినవారైనా, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలైనా విద్య ద్వారానే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని, అందుకే ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలను అందిస్తోందని మంత్రి స్పష్టం చేశారు.
అంతకుముందు మంత్రులు సింగరాయకొండలో నిర్మించనున్న బీసీ రెసిడెన్షియల్ పాఠశాల స్థలాన్ని పరిశీలించి, నిర్మాణ పనులపై అధికారులకు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఆంజనేయులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0