బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి ఎస్. సవిత గారికి ప్రకాశం జిల్లా బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ వినతిపత్రం
బీసీల విద్య, ఉద్యోగాలకు ప్రత్యేక చర్యలు కోరిన సంఘం
బీసీ వర్గాల విద్య, ఉపాధి, సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపట్టాలని కోరుతూ ప్రకాశం జిల్లా బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి ఎస్. సవితకు వినతిపత్రం సమర్పించారు.
జిల్లా కార్యదర్శి అర్రిబోయిన రాంబాబు, అంబటి బ్రహ్మయ్యల ఆధ్వర్యంలో సమర్పించిన ఈ వినతిపత్రంలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో ఓపెన్ మెరిట్ సాధించిన బీసీ అభ్యర్థులను ఓపెన్ కేటగిరీలోనే పరిగణించి, వారి రిజర్వేషన్ స్థానాలను ఇతర అర్హులైన బీసీ అభ్యర్థులకు కేటాయించేలా స్పష్టమైన ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.
అలాగే ప్రతి జిల్లాలో బీసీ స్టడీ సర్కిళ్లను ఆధునిక సౌకర్యాలతో బలోపేతం చేసి యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, డీఎస్సీ, పోలీస్, బ్యాంకింగ్, ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ తదితర పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్, డిజిటల్ క్లాస్‌రూమ్స్, ఈ-లైబ్రరీలు, కంప్యూటర్ ల్యాబ్స్, మాక్ టెస్టులు, కెరీర్ గైడెన్స్, హాస్టల్, స్టైపెండ్ వంటి సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని స్టడీ సర్కిళ్లలో సాధ్యమైనంత వరకు బీసీ అధికారులను నియమించడం ద్వారా విద్యార్థుల సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆధునిక సౌకర్యాలతో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మించాలని, ప్రతి జిల్లా కేంద్రంలో స్టడీ సర్కిల్, గ్రంథాలయం, డిజిటల్ లెర్నింగ్ సెంటర్, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, ఉద్యోగ సమాచార కేంద్రం తదితర సౌకర్యాలతో కూడిన సమగ్ర బీసీ భవన్ ఏర్పాటు చేయాలని కోరారు.
ప్రభుత్వ కమిటీలు, బోర్డులు, కార్పొరేషన్లలో బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు, బీసీ ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించి వారి సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అదే సందర్భంగా ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ, కనిగిరి, గిద్దలూరు ప్రాంతాల్లో నూతన బీసీ గురుకులాలు ఏర్పాటు చేసినందుకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి ఎస్. సవిత, ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వినతిపత్రంలోని అంశాలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ కోరింది.
కార్యక్రమంలో నూకసాని వెంకటేశ్వర్లు, మసూద్ అలీ, షేక్ శీను, అంబటి ప్రసాద్‌రావు, కీర్తి శ్రీనివాసరావు తదితర బీసీ ఉద్యోగ సంఘ నాయకులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0