లారీ డ్రైవర్ నిర్లక్ష్యం.. మామిడికాయల ఆటో ఢీ — ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ జాతీయ రహదారిపై సోమవారం విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గోల్డెన్ కేఫ్ రెస్టారెంట్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళితే… విజయవాడకు మామిడికాయల లోడుతో వెళ్తున్న ఒక ఆటో డ్రైవర్ మరియు ప్రయాణికులు టీ తాగేందుకు రహదారి పక్కన ఉన్న టీ షాప్ వద్ద ఆటోను ఆపారు. అదే సమయంలో గుంటూరు జిల్లా పత్తిపాడు గ్రామానికి చెందిన తండ్రి–కొడుకులు జి. బాపన రెడ్డి, జి. వేణు ప్రకాష్ రెడ్డి కరేడు నుంచి వస్తూ మామిడికాయల ఆటో సమీపంలో తమ ద్విచక్ర వాహనాన్ని నిలిపి ఫోన్
మాట్లాడుతున్నారు.
అప్పుడే చెన్నై నుంచి కాకినాడ వైపు వెళ్తున్న ట్యాంకర్ లారీ వేగంగా వచ్చి మామిడికాయల ఆటోను బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న ప్రభావంతో ఆటో బోల్తా పడగా అందులో ఉన్న మామిడికాయల ట్రేలు పక్కనే ఉన్న ఇద్దరిపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి 108 అంబులెన్స్ సహాయంతో తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జి. బాపన రెడ్డి మృతి చెందగా, వేణు ప్రకాష్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఈ ప్రమాదానికి లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0